: జపాన్‌లో బౌద్ధ సన్యాసులకు వినూత్న అందాల పోటీలు
సాధారణ జీవితం గడిపే మగువలకు అందాల పోటీలు పెట్టడం మనం చూశాం. పురుషులకు మిస్టర్ యూనివర్స్ అంటూ పోటీలు నిర్వహిస్తుండడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే జపాన్‌లో మాత్రం తాజాగా బౌద్ధ సన్యాసులకు అందాల పోటీలు నిర్వహించారు. కానీ బౌద్ధ సన్యాసులు అందానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు కదా. మనం చూసే పోటీలన్నీ బాహ్య సౌందర్యానికి సంబంధించినవైతే బౌద్ధ సన్యాసులకు మాత్రం అంతర్లీనంగా దాగి ఉన్న సౌందర్యానికి పోటీలు నిర్వహించారు. బౌద్ధ సన్యాసుల్లో అంతర్లీనంగా ఉండే గొప్ప విషయాలను, మంచితాన్ని బయటపడే విధంగా వారిని పలు ప్రశ్నలు అడిగారు. కేవలం ప్రశ్నలు అడగడం మాత్రమే కాదు సన్యాసుల్లో ఉన్న శక్తిని బయటపెట్టడానికి రాళ్లను పగలగొట్టడం, ఆసనాలు వేయించడం వంటి పోటీలు కూడా పెట్టారు. పోటీలను నిర్వహిస్తున్నామని ప్రకటించడమే ఆలస్యం, బౌద్ధ సన్యాసులు ఎంతో మంది ఈ పోటీల్లో పాల్గొనడానికి ఉత్సాహాన్ని చూపారు. పోటీలు నిర్వహించగా పాల్గొన్న వారిలో ఐదుగురు ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు. అనంతరం ఎంపికయిన వారి శక్తి సామర్థ్యాలను బట్టి వారికి నిర్వాహకులు బహుమతులు ఇచ్చారు. ఇటువంటి పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారికాదు. గతేడాది కూడా నిర్వహించారు. ఈ ఏడాది గతేడాది కంటే మంచి స్పందన వచ్చింది. ఇకపై ఈ పోటీల్లో పాల్గొనేందుకు మరింత ఉత్సాహం చూపిస్తారని నిర్వాహకులు చెప్పారు. జపాన్‌లో ఉన్న తొమ్మిది కోట్లమంది బౌద్ధులు ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అంశాన్నే దృష్టిలో పెట్టుకొని తాము ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.