: కరుణించిన వరుణుడు...గుంటూరు, హైదరాబాదుల్లో వర్షం
వరుణుడు కరుణించాడు. గత వారం రోజులుగా హైదరాబాదులో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సరైన సమయంలోనే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆశించిన మేర వర్షాలు కురవలేదు. ఈ నేపథ్యంలో పంటలు వేసిన రైతులు ఆకాశం వైపు ఆశగా చూడడం ప్రారంభించారు. ఈ క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాల కారణంగా రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. గుంటూరులో భారీ వర్షం కురవగా, హైదరాబాదులోని మలక్ పేటలో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో రోడ్లు జలమయం కావడంతో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. హైదరాబాదులో పలు చోట్ల చిరుజల్లులు పలకరించగా, వాతావరణం పూర్తిగా మారింది. మబ్బులు పట్టింది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి.