: రాతియుగపు సేద్యంలోనే ఎరువులు వాడారా?
హరిత విప్లవం పేరిట అధిక దిగుబడులు సాధించడానికి ఎరువులు వినియోగించడం అనేది నవతరం వ్యవసాయ పద్ధతుల్లో ఒకటిగా మనం అనుకుంటాం. అయితే రాతియుగం కాలంనాటి మొక్కల అవశేషాల్లోనే.. ఎరువుల వినియోగం ఉన్నట్లుగా కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి. ఇప్పటికీ పలు సందేహాలు ఉన్నప్పటికీ.. ఆ ఆధారాలు.. అప్పట్లో ఎరువుల తరహా వినియోగం ఉండేదనుకోవడానికి ఆస్కారం కల్పిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. స్వీడన్‌లోని ఫాల్కోపింగ్ పట్టణానికి దగ్గర్లో జరిపిన తవ్వకాల్లో కొన్ని తిండిగింజలు, మొక్కల అవశేషాలు దొరికాయి. గోథెన్‌బర్గ్ యూనివర్సిటీ వారు దీనిపై లోతుగా పరిశోధనలు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించారు. వీటిలో నైట్రోజన్ 15 (ఎన్ 15) ఐసోటోప్ బాగా ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఐదువేల ఏళ్ల కిందట రాతియుగంలోనే మనిషి ఎరువులను ఉపయోగించాడేమో అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.