: తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు.. హైదరాబాద్లో పలుచోట్ల ట్రాఫిక్ జామ్
తెలుగు రాష్ట్రాలను వరుణుడు కరుణించాడు. వర్షాలు కురిస్తే తప్ప పంటలు కాపాడుకోవడం కష్టమని రైతులు కలవరపడుతోన్న సమయంలో నిన్నటి నుంచి పలు జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయని, ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. వీటి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో చెదురుముదురుగా వర్షాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. దీంతో సాగుదారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. హైదరాబాద్లో ఈరోజు పలుచోట్ల వర్షం కురిసింది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్పల్లిలో వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీళ్లతో కూడళ్ల వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. స్వల్ప ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.