: కాబూల్‌లోని అమెరికా వర్సిటీలో ముగిసిన సైనిక కార్యాచరణ... 700 మంది విద్యార్థులను రక్షించిన భద్రతాదళాలు
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని అమెరికా యూనివర్శిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ లోకి నిన్న రాత్రి ముష్కరులు ప్రవేశించి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన భద్రతాదళాలు ముష్కరులను మట్టుబెట్టినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. సైనిక కార్యాచరణ ముగిసిందని.. 700 మంది విద్యార్థులను రక్షించామని పేర్కొన్నారు. నిన్న రాత్రి వర్సిటీలోకి ప్రవేశించిన ముష్కరులు కనిపించిన వారిపై కాల్పులు జరిపారు. దీంతో భయపడిపోయిన విద్యార్థులు, అధ్యాపకులు బల్లలకింద దాక్కున్నారు. ముష్కరులు వర్సిటీలోకి ప్రవేశిస్తూనే పేలుళ్లు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా.. 30 మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. గాయపడిన వారికి చికిత్స అందుతోందని తెలిపారు.