: ఫైర్ అలారమ్ మోగడం వల్లే కజకిస్థాన్ లో దిగిన ఏఐ విమానం
ముంబై నుంచి న్యూయార్క్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలోని కార్గో సెక్షన్లో మంటలు చెలరేగాయని సూచిస్తూ, ఫైర్ అలారమ్ మోగడంతో ముందుజాగ్రత్త చర్యగానే కజకిస్థాన్ కు విమానాన్ని దారిమరల్చి ల్యాండ్ చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. బోయింగ్ 777 రకానికి చెందిన ఈ విమానంలోని అందరు పాసింజర్లూ క్షేమమేనని, ప్రస్తుతం ఇంజనీర్లు దీన్ని పరీక్షిస్తున్నారని ఓ అధికారి తెలిపారు. ముంబై నుంచి గత అర్ధరాత్రి 2:25కు బయలుదేరిన విమానం ఉదయం 8 గంటల ప్రాంతంలో కజక్ లో దిగిందని తెలిపారు. విమానానికి ఎలాంటి ఇబ్బందీ లేదని, న్యూజర్సీ దాకా వెళుతుందని నిపుణులు ధ్రువీకరిస్తేనే విమానం టేకాఫ్ జరుగుతుందని, ఇండియా నుంచి అక్కడికి వెళ్లేందుకు ఓ ఇంజనీర్ల బృందం సిద్ధంగా ఉందని వివరించారు. ప్రయాణికులను చేరవేసేందుకు మరో విమానాన్ని సిద్ధంగా ఉంచినట్టు పేర్కొన్నారు.