: కనీస ధరలో ఆరోవంతుకే మాల్యా విమానాన్ని విక్రయించిన సర్వీస్ టాక్స్ విభాగం... తీర్థయాత్రలకు తిప్పుతామన్న కొనుగోలుదారు


తమకు పన్ను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా విమానాన్ని ఎట్టకేలకు సర్వీస్ టాక్స్ విభాగం అమ్మేసింది. ముంబైలో పార్క్ చేసిన ఈ విమానం కనీస ధరను 24.5 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 152 కోట్లు) విక్రయించాలని పన్ను అధికారులు నిర్ణయించగా, గతంలో వేలం వేసినప్పుడు కేవలం 3.5 మిలియన్ డాలర్లు మాత్రమే ఆఫర్ రాగా, ఈసారి ఆమొత్తం 4.1 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 27.39 కోట్లు)కు పెరిగింది. ఎస్జీఐ కామెక్స్ సంస్థ ఈ బిడ్ దాఖలు చేయగా, విమానం వేలం పూర్తయినట్టు అధికారులు ప్రకటించారు. ఈ విమానాన్ని తీర్థయాత్రల నిమిత్తం తిప్పుతామని, విదేశీయుల ఆధ్యాత్మిక పర్యాటకం నిమిత్తం వాడుతామని ఎస్జీఐ కామెక్స్ చైర్మన్ శ్రీవాస్తవ వెల్లడించారు. దీన్ని ప్రైవేటు వ్యక్తుల విహారానికి వినియోగించే ఆలోచన లేదని అన్నారు. కాగా, ఈ విమానాన్ని తొలిసారి వేలం వేసినప్పుడు కేవలం రూ. 1 కోటికి మాత్రమే బిడ్ దాఖలు కావడం గమనార్హం. ఇప్పుడీ విమానాన్ని వాడకంలోకి తేవాలంటే మరో రూ. 23 కోట్లకు పైగా వెచ్చించాల్సి వుంటుందని సమాచారం.

  • Loading...

More Telugu News