: మీకిచ్చి పెళ్లి చేయడం కంటే అమ్మాయిలను ఇంట్లో పెట్టుకోవడమే నయం!.. బిజ్నోర్ యువకులకు చేదు అనుభవం
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోని పలు గ్రామాల్లో పెళ్లి బాజాలు మోగడం లేదు. అమ్మాయిలు దొరక్క యువకులు వెర్రెత్తిపోతుంటే.. మీకివ్వడం కంటే పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచుకోవడమే మేలు అంటూ అమ్మాయిల తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారు. ఇక్కడ అమ్మాయిల తల్లిదండ్రుల భయానికి, అబ్బాయిల ఆందోళనకు ఓ కారణం ఉంది. ఆ కారణం పేరు జీవనది గంగ! గంగానదిని ఆనుకుని బిజ్నోర్ జిల్లాలోని 25 గ్రామాలున్నాయి. ఆయా గ్రామాలకు సరైన రక్షణ గోడ(గట్టు) లేకపోవడంతో వరదల సమయంలో తరచూ ఈ గ్రామాలు మునిగిపోతుంటాయి. ప్రతిసారీ ఇదే పరిస్థితి. దీంతో పంటలు నాశనమైపోతున్నాయి. సారవంతమైన పంట భూములు కోతకు గురవుతున్నాయి. దీంతో వరద బాధిత గ్రామాలకు పిల్లను ఇచ్చేందుకు అమ్మాయిల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఉత్తరాఖండ్ నుంచి బిజ్నోర్ జిల్లాలో ప్రవహించే గంగానదితో నిన్నమొన్నటి వరకు నదీ పరీవాహక గ్రామాలు సుభిక్షంగా ఉండేవి. రైతులు బంగారం పండించేవారు. అందరూ సుఖసంతోషాలతో ఉండేవారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సంతోషం స్థానంలో దుఖం వచ్చి చేరింది. దీనికి కారణం గంగానదికి వరదలు. వరదలతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడపసాగారు. నది ఉగ్రరూపానికి పచ్చని పంట పొలాల్లోని సారవంతమైన నేల కోతకు గురవుతోంది. పంటలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఇక వర్షాకాలంలో అయితే గ్రామస్తుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ఇళ్లు, పంటపొలాలను నది ముంచెత్తుతోంది. ఫలితంగా గ్రామస్తులు దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. ఎప్పుడు ఏవైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. బిజ్నోర్ లోని ఈ గ్రామాలు తరచూ వరదల బారిన పడుతుండడంతో వాటితో సంబంధం కలుపుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ ఊరి యువకులకు పిల్లను ఇవ్వడం కంటే పెళ్లి లేకున్నా పర్వాలేదన్న అభిప్రాయానికి అమ్మాయిల తల్లిదండ్రులు వచ్చారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా ఆయా గ్రామాల్లో పెళ్లి బాజాలు వినిపించడం లేదు.