: కేసీఆర్ చెప్పే కోటి ఎకరాల లెక్కలు కాకిలెక్కలు!: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే అబద్ధాలు చెబుతున్నారని టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని పదేపదే చెబుతున్నారని, అవి కాకి లెక్కలని అన్నారు. '83 వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తూ ప్రాజెక్టులు కడుతున్నామంటున్నారు. ఇంత ప్రజాధనాన్ని ఎలా ఖర్చుచేస్తున్నారో వెల్లడించండి' అంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఆయన నిలదీశారు. '152 మీటర్ల ఎత్తులో కట్టాల్సిన ప్రాజెక్టును 148 మీటర్లకు పరిమితం చేస్తూ ఒప్పందం చేసుకొచ్చి...సంబరాలు చేసుకుంటావా? ఇందులో ఏమైనా హేతుబద్ధత ఉందా?' అని ఆయన నిలదీశారు. ఉండాల్సిన ఎత్తుకంటే తగ్గించి ఒప్పందం చేసుకుంటానంటే మహారాష్ట్ర వాడు ఎందుకు అంగీకరించడని ఆయన అడిగారు. గతంలో 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మిస్తామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వద్దని చెప్పారని ఆయన గుర్తు చేశారు. అలాంటి ఆయన మహారాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి, తెలంగాణకు ప్రయోజనం కలిగేలా ఎలా ఒప్పందం చేసుకుని ఉంటారో ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏ కాంట్రాక్టర్ తో మాట్లాడినా వాస్తవాలు వెల్లడి అవుతాయని ఆయన చెప్పారు. ప్రాణహిత, చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంలో 36 వేల కోట్ల రూపాయల నుంచి 83 వేల కోట్ల రూపాయలకు అంచనాలు పెంచినప్పుడు గ్లోబల్ టెండర్లను ఎందుకు పిలవలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.