: విజయాలు నాకు కూడా కావాలి...ఏది హిట్టవుతుందో ఎలా చెప్పగలం?: సినీ నటుడు విక్రమ్
తనకు కూడా విజయాలు కావాలని సినీ నటుడు 'చియ్యాన్' విక్రమ్ తెలిపాడు. 'ఇరుమగన్' (తెలుగులో 'ఇంకొక్కడు') సినిమా ప్రమోషన్ లో భాగంగా విక్రమ్ మాట్లాడుతూ, ప్రతి నటుడు తాను నటించిన సినిమా విజయం సాధించాలనే కోరుకుంటాడని అన్నాడు. తాను కూడా అందర్లాగే నటించిన ప్రతి సినిమా విజయం సాధించాలని కోరుకుంటానని చెప్పాడు. అయితే ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో, ఏది విజయం సాధిస్తుందో చెప్పడం సాధ్యం కాదని అన్నాడు. అలా ఎవరైనా సినిమా హిట్టవుతుందని ముందే చెప్పగలిగితే వారు అసలు ఫ్లాప్ సినిమాలు చేయరని అన్నాడు. హిట్ లేదా ఫ్లాప్ అనేవి నటుడి చేతుల్లో ఉండవని, దానిని నిర్ధారించడంలో పలు విషయాలు ఉంటాయని ఆయన తెలిపాడు. హిట్ అయితే సంతోషంగా ఉంటానని, ఫ్లాప్ అయితే బాధపడతానని అన్నాడు. మనం చేసిన పని ఫలితం ఇవ్వకపోతే ఎవరైనా బాధపడతారని, తాను కూడా అందర్లాంటి వాడినేని ఆయన తెలిపారు. ఈ సినిమాలో తాను రెండు పాత్రలు పోషిస్తున్నానని, ఆ రెండు పాత్రలు అలరిస్తాయని ఆశిస్తున్నానని చెప్పాడు.