: ‘రియో’కు పంపిన భారత అధికారులను రాబందులతో పోల్చిన పరేష్ రావెల్
రియో ఒలింపిక్స్ లో భారత అధికారులు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్న అథ్లెట్ ఓపి జైషా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, సినీ నటుడు పరేష్ రావెల్ చాలా ఘాటుగా స్పందించారు. రియో ఒలింపిక్స్ కు పంపిన భారత్ అధికారులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘ఒలింపిక్స్ లో జైషా సంఘటన మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. మన క్రీడాకారులతో రాబందులైన ఇటువంటి అధికారులను పంపామా?’ అంటూ పరేష్ రావెల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, ‘రియో’లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలో మారథాన్ లో పాల్గొన్న ముప్ఫై మూడు సంవత్సరాల జైషాకు గొంతెండిపోతుంటే కనీసం మంచినీళ్లు అందించేందుకు కూడా మన అధికారులెవ్వరూ అక్కడ లేరు. తాను ఎలా బతికి బయటపడ్డానో తనకే తెలియదంటూ భారత్ కు వచ్చిన జైషా ఇటీవల వ్యాఖ్యానించింది.