: ఆ ట్వీట్ కు గౌరవప్రదంగా సమాధానమిచ్చిన సుష్మా స్వరాజ్
సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్విట్టర్ వేదికగా నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తుండటం, దానికి ఆమె ఓపికగా సమాధానం చెబుతుండడం మనం చూస్తున్నాం. ప్రపంచ విషయాలు, రాజకీయాలే కాకుండా, తమ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన విషయాలకు కూడా పరిష్కారం చూపించాలంటూ ఆయా ట్విట్టర్ ఖాతాదారులు సుష్మాస్వరాజ్ ను అడగటం కనిపిస్తుంటుంది. తాజాగా, సుష్మా స్వరాజ్ కు ట్విట్టర్ ఖాతాదారుడు ఒకరు ‘సుష్మా స్వరాజ్.. నిజంగా మీరేనా? భారత రాజకీయ నాయకుల లక్షణాలు మీలో లేవు. ఎందుకంటే, మీరు, మా గురించి, అదే, భారతీయుల గురించి ఆలోచిస్తున్నారు!’ అంటూ సదరు వ్యక్తి ఆమెను పొగుడుతూనే ప్రశ్నించాడు. సుష్మా మాత్రం చాలా హుందాగా, గౌరవప్రదంగా దీనికి స్పందించింది. ‘దయచేసి అలాంటి భావాలతో ఉండొద్దు, భారత రాజకీయ నేతలు చాలా సున్నిత మనస్కులు. సాయపడాలనే తత్వం బాగా ఉన్నవారు’ అంటూ ఆమె పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్ సమాధానం చెప్పిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.