: జమ్మూకాశ్మీర్ ఆందోళనకారుల టార్గెట్ పోలీస్... దాడులతో ఇద్దరు అధికారుల రాజీనామా!


తీవ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి. రాళ్లు పట్టుకుని రోడ్డెక్కుతున్న ఆందోళనకారులను విధుల్లో భాగంగా భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నారు. దీంతో భద్రతా సిబ్బందిని ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి కుటుంబాలపై దాడులకు దిగుతున్నారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు గాయపడుతున్నారు. పలువురి ఇళ్లు ధ్వంసమయ్యాయి. సోపోర్ జిల్లాలో తమ నివాసాలపై ఆందోళనకారులు దాడులకు దిగడంతో ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. జమ్మూకాశ్మీర్ లో ఆందోళనకారులకు భయపడి భద్రతాధికారులు ఇలా రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రాజీనామా చేసిన ఎస్పీవో వసీమ్ అహ్మద్ షేక్ మాట్లాడుతూ, తన నివాసంపై దాడి జరగడంతో రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కుటుంబమంతా తనపై ఆధారపడడడంతో, ఇకపై తాను పోలీసుగా కొనసాగలేనని ఆయన తెలిపారు. అందుకే ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. తాజాగా జరుగుతున్న కశ్మీర్ అలర్లలో 68 మంది మృతి చెందగా, సుమారు 5 వేల మందికి పైగా గాయపడ్డారు. అదే సమయంలో అల్లరిమూకల రాళ్లదాడిలో పోలీసులు కూడా భారీ సంఖ్యలో గాయపడ్డారు.

  • Loading...

More Telugu News