: పుష్కరాల సక్సెస్ తో పోలీసుల ఇమేజ్ పెరిగింది: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఒక విజయం ఎంతటి శక్తినిస్తుందో కృష్ణా పుష్కరాలు రుజువు చేశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో పుష్కరాల్లో పనిచేసిన సిబ్బందికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పుష్కరాలు జరిగాయని అన్నారు. పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని, ఈ విజయం ఏ ఒక్కరిదీ కాదని అన్ని వర్గాల ప్రజలదని అన్నారు. కృష్ణమ్మ అందరినీ కలిపిందని వ్యాఖ్యానించారు. పుష్కరాలతో పోలీసుల ఇమేజ్ పెరిగిందని చంద్రబాబు నాయుడు అన్నారు. పోలీసులు ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. పోలీసులు పోటీ పడి సేవాభావంతో పనిచేస్తారని పుష్కరాల ద్వారా నిరూపితమైందని అన్నారు. పోలీసులతో పాటు వాలంటీర్లంతా పోటీ పడి పనిచేశారని ఆయన ప్రశంసించారు. పుష్కరాలకు వచ్చిన వికలాంగులకు సాయపడ్డారని, మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకున్నారని ఆయన అన్నారు. కృష్ణానది పుష్కరాల్లో భారీ అన్న సంతర్పణ జరిగిందని పేర్కొన్నారు. డ్రోన్లు, సెల్ ఫోన్లు వాడి మీడియాకు పుష్కరాల ఫోటోలు అందించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసులంటే లాఠీలు ఉపయోగిస్తారన్న చెడు భావం ప్రజల్లో ఉండేదని, పుష్కరాల ద్వారా పోలీసులు ప్రజాసేవకులుగా నిరూపించుకున్నారని అన్నారు. పరిశుభ్రత విషయంలో పురపాలక శాఖ పనితీరు ప్రశంసనీయమని అన్నారు. విజయవాడను సుందర నగరంగా తీర్చిదిద్దడంలో పురపాలక శాఖ పాత్ర ఉందని ఆయన అభినందించారు. పుష్కరాల్లో సాంకేతికతను ఉపయోగించుకున్నామని చెప్పారు.