: సైనా బాటలో పారుపల్లి!... గోపీచంద్ అకాడెమీని వీడిన కశ్యప్!
దేశం గర్వించదగ్గ కోచ్ గా ఎదిగిన పుల్లెల గోపీచంద్... ఒలింపిక్స్ లో తన శిష్యుల ద్వారా దేశానికి రెండు పతకాలు సాధించిపెట్టాడు. అయితే ఆయన నేతృత్వంలోని గోపీచంద్ అకాడెమీని వీడుతున్న భారత ఆశాకిరణాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 2012 ఒలింపిక్స్ దాకా గోపీచంద్ అకాడెమీలో ఉన్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆ ఒలింపిక్స్ లో పతకం సాధించింది. ఆ తర్వాత గోపీచంద్ అకాడెమీని వీడిన ఆమె మొన్నటి రియో ఒలింపిక్స్ లో అంతగా రాణించలేకపోయింది. తాజాగా బ్యాడ్మింటన్ లో ప్రముఖ క్రీడాకారుడిగా కొనసాగుతున్న పారుపల్లి కశ్యప్ కూడా గోపీచంద్ అకాడెమీని వీడాడు. మోకాలికి అయిన గాయం కారణంగా కశ్యప్ రియో ఒలింపిక్స్ లో పాల్గొనలేకపోయాడు. గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న అతడు ఇకపై బెంగళూరును కేంద్రంగా చేసుకుని కెరీర్ కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. దీంతోనే గోపీచంద్ అకాడెమీకి గుడ్ చెప్పిన కశ్యప్... బెంగళూరులోని టామ్స్ బ్యాడ్మింటన్ అకాడెమీలో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.