: రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావు బాధ్యుడు కాదట!... తేల్చేసిన హెచ్ఆర్డీ కమిటీ!
దేశవ్యాప్తంగా పెను కలకలం రేపిన హైదరాబాదు సెంట్రల్ వర్సిటీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ తన విచారణను పూర్తి చేసింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు వర్సిటీ వీసీ అప్పారావు గాని, అధికార యంత్రాంగం గానీ బాధ్యులు కాదని ఆ కమిటీ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇప్పటికే విచారణను పూర్తి చేసిన సదరు కమిటీ త్వరలోనే తన నివేదికను కేంద్రానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో వర్సిటీ హాస్టల్ లోని తన గదిలోనే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు వర్సిటీ వీసీ అప్పారావుదే బాధ్యత అంటూ విద్యార్థి సంఘాలు రోజుల తరబడి ఆందోళనలు కొనసాగించాయి. తాజాగా ఈ ఘటనకు అప్పారావు బాధ్యుడు కాదంటూ అలహాబాదు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ రూపన్ వాల్ నేతృత్వంలోని విచారణ కమిటీ తేల్చేయడం గమనార్హం.