: పుష్కరాల పారిశుద్ధ్య కార్మికులకు కూలీ తగ్గిందట!... అమరావతిలో ఆందోళనకు దిగిన వైనం!
కృష్ణా పుష్కరాలు నిన్న ముగిశాయి. ఈ నెల 12 నుంచి 12 రోజుల పాటు కోలాహలంగా జరిగిన పుష్కరాల్లో పారిశుద్ధ్య కార్మికులు నడుం వంచి పనిచేశారు. 12 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా పనిచేసిన సదరు కార్మికులకు హామీ ఇచ్చిన మేర కూలీ డబ్బులు అందలేదట. దీంతో వారు నేటి ఉదయం అమరావతిలో ఆందోళనకు దిగారు. పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి తాము పనిచేసినా... ముందుగా మాట ఇచ్చిన మేర కూలీ డబ్బులు ఇవ్వలేదని వాపోయారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని హామీ ఇచ్చిన మేరకు కూలీ డబ్బులు ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.