: కశ్మీర్ అల్లర్ల ఫలితం.. 45 రోజుల్లో రూ.6 వేల కోట్లు నష్టం!
అందాల కశ్మీర్ నెలన్నర రోజులుగా రావణకాష్టంలా రగులుతున్న విషయం తెలిసిందే. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత రేకెత్తిన ఆందోళనలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. అల్లర్లను అణచివేసేందుకు ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మరోవైపు వేర్పాటు వాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. స్కూళ్లు మూతబడిపోయాయి. యువత రాళ్లు పట్టుకుని రోడ్లపైకి వస్తోంది. శ్రామిక జీవులకు తిండి గగనమైంది. పస్తులతో వారు అలమటించిపోతున్నారు. ఓవైపు ఇలా ఉంటే మరోవైపు లోయలో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. గత 45 రోజుల్లో ఏకంగా ఆరువేల కోట్ల రూపాయలు నష్టపోయినట్టు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు దాదాపు రూ.135 కోట్ల చొప్పున నష్టపోతున్నట్టు కశ్మీర్ ట్రేడర్స్ అండ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మొహ్మద్ యాసిన్ ఖాన్ తెలిపారు. ఇంతటి సంక్షోభాన్ని తామెప్పుడూ చూడలేదని పేర్కొన్న ఆయన కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న సమస్యకు శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘వ్యవసాయం నుంచి సేవారంగం వరకు అన్ని కార్యకలాపాలు దాదాపు మూతపడ్డాయి. హోటళ్ల పరిస్థితి అయితే మరింత అధ్వానంగా తయారైంది. హౌస్‌బోట్లు, షికారాల పరిస్థితి దయనీయంగా మారింది. వస్త్రవ్యాపారం కూడా అడుగంటిపోయింది. ఇలాంటి పరిస్థితిని మేమెప్పుడూ చూడలేదు’’ అని యాసిన్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం కశ్మీర్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. దీంతో రూ.5,400-5,700 కోట్లు నష్టం వాటిల్లింది. ఆ తర్వాత అంతకుమించి నష్టపోవడం ఇదేనని ఆయన వివరించారు. కాగా గతనెల 8న ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం జరిగిన అల్లర్లలో ఇప్పటి వరకు 67 మంది మృతి చెందారు. 46 రోజులుగా కర్ఫ్యూ అమలులో ఉంది.