: ఉత్తర కొరియా క్షిపణి పరీక్షపై మండిపడిన అమెరికా.. మిత్రదేశాలకు ఏం జరిగినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక

ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్షను అమెరికా మిలటరీ ధ్రువీకరించింది. బుధవారం ఉదయం 4.59 (స్థానిక కాలమానం ప్రకారం)కు జలాంతర్గామి ద్వారా కేఎన్-11 క్షిపణికి ఉత్తర కొరియా పరీక్షలు నిర్వహించింది. జపాన్‌ సముద్రంలో కొరియాకు 480 కిలోమీటర్ల దూరంలో ఈ క్షిపణి సముద్రంలో కూలినట్టు అమెరికా ఆర్మీ పేర్కొంది. ఉత్తర కొరియా చర్యలపై అమెరికా భగ్గుమంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తుతామని పేర్కొంది. ఈ చర్యలు ఉత్తర అమెరికాను ఏమాత్రం భయపెట్టలేవని నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ పేర్కొంది. దక్షిణ కొరియా, జపాన్ తదితర తమ మిత్రదేశాలకు ఏం జరిగినా చూస్తూ ఊరుకోబోమని పెంటగాన్ అధికార ప్రతినిధి కమాండర్ గ్యారీ రోస్ హెచ్చరించారు. ఏ దాడి నుంచైనా తమను, తమ మిత్రదేశాలను రక్షించుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఉద్రికత్తలను పెంచే అన్ని చర్యలను కట్టిపెట్టాల్సిందిగా నార్త్ కొరియాను కోరినట్టు చెప్పారు. కాగా కొరియా బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిలిపేయాల్సిందిగా ఐరాస భద్రతా మండలి తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News