: మీడియా ముందుకొచ్చిన భువనగిరి ఎమ్మెల్యే!... నయీమ్ కు తానెప్పుడూ భయపడలేదని వెల్లడి!
గ్యాంగ్ స్టర్ నయీమ్ నుంచి తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురయ్యారని భావిస్తున్న టీఆర్ఎస్ నేత, నల్లగొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఎట్టకేలకు బయటకు వచ్చారు. తన అనుమతి లేనిదే భువనగిరిలో అడుగుపెట్టరాదంటూ శేఖర్ రెడ్డిని నయీమ్ బెదిరించినట్లు వార్తలు వినిపించాయి. నయీమ్ బెదిరింపులతో దాదాపుగా శేఖర్ రెడ్డి భువనగిరికి దూరమయ్యారన్న వార్తలూ వెల్లువెత్తాయి. ఈ క్రమంలో దాదాపు నెలరోజుల పాటు అజ్ఞాతంలో ఉండిపోయిన శేఖర్ రెడ్డి నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ ప్రైవేటు న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు. తానెప్పుడు నయీమ్ కు భయపడలేదని ఆయన చెప్పారు. నయీమ్ కు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయానన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. భువనగిరి ప్రజలకు ప్రతిరోజు అందుబాటులోనే ఉన్నానని తెలిపారు. నయీమ్ లాంటి కిరాతకుడు హతం కావడం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. భువనగిరి ఇన్నాళ్లు నయీమ్ కనుసన్నల్లో ఉండిపోయిందన్న శేఖర్ రెడ్డి... ఈ కారణంగానే తన నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నయీమ్ ఎన్ కౌంటర్ తో భువనగిరి ప్రజలు వెలుగులోకి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. నయీమ్ లాంటి గ్యాంగ్ స్టర్లు, రౌడీ షీటర్లకు ఎవరూ భయపడవద్దని ఆయన పిలుపునిచ్చారు. నయీమ్ తననెప్పుడూ కలవలేదన్నారు. తనతో అతడు కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేదన్నారు. నయీమ్ నుంచి ప్రాణహాని ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికతో ప్రభుత్వం తనకు సెక్యూరిటీ పెంచిందని ఆయన తెలిపారు. ఇందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నయీమ్ దురాగతాలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతోందని ఆయన అన్నారు. సిట్ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. గ్యాంగ్ స్టర్లకు ఎవరు సహకరించినా శిక్షార్హులేనని ఆయన తేల్చిచెప్పారు.