: నయీమ్ దందాపై 39 కేసులు!... నిన్న ఒక్కరోజే 10 మంది అరెస్ట్!


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గ్యాంగ్ స్టర్ నయీమ్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటిదాకా 39 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతల కోసం తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిన్న కేసు వివరాలను వెల్లడించింది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఈ నెల 8న జరిగిన ఎన్ కౌంటర్లో నయీమ్ హతమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నయీమ్, అతడి బంధువుల ఇళ్లలో పోలీసులు జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున నగదు, మారణాయుధాలు, కీలక సమాచారం లభించాయి. దీంతో కేసు దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన సిట్ కు పలు వర్గాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన సిట్ ఇప్పటిదాకా మొత్తం 39 కేసులు నమోదు చేసింది. ఇక నిన్న ఈ వ్యవహారంలో అరెస్టుల పర్వం కూడా మొదలైంది. తొలి రోజే 10 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ ప్రకటించింది. నల్లగొండలో ఆరుగురిని అరెస్ట్ చేసిన సిట్... నయీమ్ సొంతూరులో నలుగురిని అదుపులోకి తీసుకుంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సిట్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News