: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటావా?: అచ్చెన్నాయుడుకి నట్టి కుమార్ సవాల్
మీడియా సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు చర్చకు వస్తే, తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని నిర్మాత నట్టి కుమార్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సైకిల్ స్టాండ్ ఓనర్ గా కెరీర్ ప్రారంభించిన జగ్గిరెడ్డి ఈ రోజు ఎలా ఎదిగాడని ప్రశ్నించారు. ఏపీలో నయీం సెటిల్ మెంట్లన్నీ జగ్గిరెడ్డి చూసేవాడని ఆయన చెప్పారు. పీలా గోవిందు నివాసం నుంచి జగ్గిరెడ్డి ఈ లావాదేవీలు నిర్వహించేవాడని ఆయన తెలిపారు. ఈ క్షణం వైజాగ్ హార్బర్, పోర్టుల నుంచి వెళ్లే క్యారియర్లపై నిఘా వేస్తే సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు దొరికే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ జగ్గిరెడ్డి వెనుక అచ్చెన్నాయుడు ఉన్నారని నట్టి కుమార్ ఆరోపించారు. ఇందుకు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, తాను నిరూపిస్తే అచ్చెన్నాయుడు రాజకీయ సన్యాసం చేస్తారా? అని ఆయన సవాలు విసిరారు. ఆయన ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టుబడులు ఎలా పెట్టారో చర్చకు రాగలరా? అని ఆయన ప్రశ్నించారు. తనది తప్పుంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన తెలిపారు. జగ్గిరెడ్డి తనను చాలా సార్లు హెచ్చరించాడని, పెద్దవాళ్లతో గొడవలెందుకని తనతో అనేవాడని ఆయన చెప్పారు.