: వచ్చే ఒలింపిక్స్ లో సింధు గోల్డ్ మెడల్ సాధించాలి: సీఎం చంద్రబాబు
వచ్చే ఒలింపిక్స్ లో పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించాలని తాము కోరుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. కృష్ణా పుష్కరాల ముగింపు సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ, సింధు స్వర్ణ పతకం సాధించాలని ఈ పుష్కరాల సందర్భంగా సంకల్పం చేశామని, సింధు సాధించి తీరుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేయాలని గోదావరి పుష్కరాల్లో సంకల్పం చేశామని, ఆ సంకల్పం నెరవేరిందని అన్నారు. ఈ పుష్కరాల్లో మరో సంకల్పం చేస్తున్నానని, కృష్ణా-పెన్నా నదులను అనుసంధానం చేయాలని కోరుకుంటున్నానని, అది కూడా నెరవేరుతుందని అన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా తానిచ్చిన పిలుపు మేరకు విజయవాడ ప్రజలు ముందుకు వచ్చి, తమకు తోచిన విధంగా సేవలందించడం చాలా సంతోషంగా ఉందని, వాళ్లందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సేవకు మారుపేరుగా కృష్ణానదీ తీరం నిలిచిందని, పుష్కరాల్లో అధికార యంత్రాంగం బాగా పనిచేసిందని ఆయన అభినందించారు. కృష్ణా పుష్కరాల్లో పోటీ పడి మరి సేవ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యావాదాలు తెలుపుకుంటున్నానంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.