: చైనా ఆందోళనను పట్టించుకోని భారత్...బ్రహ్మోస్ మోహరింపు
భారత సరిహద్దుల్లో బ్రహ్మోస్ క్షిపణులను మోహరించడం ద్వారా రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతాయని చైనా ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ భారత్ ఘాటు సమాధానం చెప్పింది. తమ సరిహద్దుల్లో ఏదైనా చేసుకునే అధికారం తమకు ఉందని అధికారులు స్పష్టం చేశారు. దానిని ఇతర దేశాలకు చెప్పాల్సిన అవసరం లేదని భారత్ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న భారత సరిహద్దు ప్రాంతంలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను విస్తరిస్తోంది. వీటిని ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు అవకాశం ఉంటుంది. గత కొంత కాలంగా భారత గగనతలంలోకి చైనాకు సంబంధించిన డ్రోన్లు, హెలికాప్టర్లు దూసుకువస్తున్నాయి. దీనిని గుర్తించిన అధికారులు, భారత సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బ్రహ్మోస్ క్షిపణులను మోహరిస్తున్నారు.