: సరిహద్దుల్లో పందుల తలకాయలు వేలాడదీసి ముస్లింల వలసలు నిరోధిస్తామంటున్న హంగేరి
తమ దేశంలోకి ముస్లింల వలసలను నిరోధించేందుకు గాను హంగేరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నుంచి విమర్శలు తలెత్తుతున్నాయి. సెర్బియా సరిహద్దు నుంచి ముస్లింల వలసలను అడ్డుకునేందుకుగాను హంగేరి సరిహద్దు కంచె వద్ద పందుల తలకాయలను వేలాడ దీయాలంటూ పాలకపక్ష పార్లమెంట్ సభ్యుడు గ్యోర్జి స్కాఫిన్ సూచించారు. అయితే, ఈ సూచనపై ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు. మానవహక్కుల సంఘాలు కూడా విరుచుకుపడ్డాయి. ఇటువంటి ఆలోచన చేయడంపై మండిపడుతున్నాయి. కాగా, తమ దేశంలోకి వస్తున్న ముస్లింల వలసలను అరికట్టేందుకు సెర్బియా వద్ద సరిహద్దును హంగేరి గత ఏడాడే మూసివేసింది. పదునైన కంచెను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ వలస ప్రజలు దూసుకువస్తుండటంతో హంగేరి సైన్యం వారిపై భౌతిక దాడులకు కూడా పాల్పడింది. అయితే, సరిహద్దుల ద్వారా దాదాపు పది లక్షల మంది వలసదారులు తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని, ఎన్ని ప్రయత్నాలు చేసిన వలసలు ఆగడం లేదన్నది హంగేరి ప్రభుత్వ వాదనగా ఉంది.