: కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు?: కోదండరాం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్న కొత్త జిల్లాల పక్రియపై జేఏసీ చైర్మన్ కోదండరాం స్పందించారు. ఈరోజు హైదరాబాద్‌లోని నాంపల్లి టీజేఏసీ కార్యాలయంలో తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తెలపకపోతే ప్రాంతాల మధ్య వైషమ్యాలు అధికమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదో షెడ్యూలులోని ఏజెన్సీ ప్రాంతాల గురించి ఆయన మాట్లాడుతూ వాటన్నింటినీ ఒకే జిల్లాలో ఉంచాలని అన్నారు. వరంగల్‌ను రెండు జిల్లాలుగా విభజించడం వల్ల చేకూరే ప్రయోజనాలేమిటని కోదండరాం ప్రశ్నించారు. జిల్లా కోసం పోరాటం చేస్తోన్న గద్వాల, జనగామ వాసుల సూచనలను గౌరవించాలని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ముంబయికి బయలుదేరిన అంశంపై స్పందించిన కోదండరాం, మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకుంటోన్న ఒప్పందం మంచిదేనని అన్నారు. అయితే, ఆ వివరాలన్నీ బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు విడిచిన నయీమ్ డైరీలో ఉన్న వివరాలన్నింటిని కూడా వెల్లడి చేయాలని అన్నారు.