: సింధు సన్మాన వేదికపై శివమణి సందడి!... పక్కనే నిలబడి ఎంజాయ్ చేస్తున్న బొండా!
రియో సిల్వర్ స్టార్ పీవీ సింధు ఘనసన్మానానికి విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదిక జనహోరుతో మారు మోగుతోంది. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ లను భారీ ర్యాలీతో ఏపీ మంత్రులు స్టేడియానికి తీసుకువస్తున్నారు. ఆ ర్యాలీ ఇప్పుడిప్పుడే విజయవాడ నగరంలోకి ఎంటరైంది. స్టేడియం చేరుకునేందుకు ఇంకా చాలా సమయమే పడుతుందని సమాచారం. ఈలోగానే స్టేడియం మొత్తం జనంతో నిండిపోయింది. సింధుకు జరిగే సన్మానాన్ని చూసేందుకు బెజవాడ యువత, ప్రత్యేకించి పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వెరసి స్టేడియం ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. సింధుకు సన్మానాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం డ్రమ్స్ మాస్టర్ శివమణిని కూడా అక్కడికి రప్పించింది. సింధు అక్కడకు చేరుకునేలోగా కాస్తంత సందడి చేద్దామని మైకు వద్దకు వచ్చిన శివమణి తనదైన స్టైల్లో చేతుల్లో స్టిక్స్ తిప్పుతూ నోటితోనే మ్యూజిక్ వినిపిస్తూ అక్కడి వారిలో ఉత్సాహం నింపుతున్నాడు. ఇక ఎయిర్ పోర్టులో సింధుకు స్వాగతం చెప్పిన తర్వాత నేరుగా స్టేడియం చేరుకున్న బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు... శివమణి పక్కన నిబలడి ఆ సంగీత మాంత్రికుడు చేస్తున్న విన్యాసాలను ఆస్వాదిస్తూ నిలబడ్డారు.