: చేతిలో మనిషి తలతో ఠాణాకొచ్చిన కన్నడ యువకుడు!... బెంబేలెత్తిపోయిన ఖాకీలు!
దుస్తుల నిండా రక్తపు మరకలు... ఓ చేతిలో మనిషి తలతో పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టిన ఓ యువకుడిని చూసి కర్ణాటక ఖాకీలు బెంబేలెత్తిపోయారు. తీరా అతడు లొంగిపోయేందుకు వచ్చాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మొన్న రాత్రి కర్ణాటక రాజధాని బెంగళూరు శివారు ప్రాంతంలోని దేవనహళ్లి పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... యలహంక శివారులోని ఉగనవాడికి చెందిన మంజునాథ, శశికుమార్ లు స్నేహితులు. కొంతకాలం క్రితం తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం శశికుమార్ వద్ద మంజునాథ రూ.25 వేలు అప్పుగా తీసుకున్నాడట. అయితే ఈ అప్పును అతడు సకాలంలో చెల్లించలేకపోయాడు. ఉగనవాడి సమీపంలో ఆదివారం రాత్రి ఇద్దరు మిత్రులు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత మద్యం మత్తులో ఉండగానే మంజునాథ తీసుకున్న అప్పు విషయాన్ని శశికుమార్ ప్రస్తావించాడు. తీసుకున్న అప్పును ఎందుకు తీర్చడం లేదంటూ అతడు మంజునాథతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన శశికుమార్ కత్తి తీసుకుని మంజునాథపై దాడి చేశారు. మంజునాథ తలను అతడి శరీరం నుంచి వేరు చేసి చంపేశాడు. ఆ తర్వాత మంజునాథ తలను ఓ చేతితో పట్టుకుని శశికుమార్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.