: కరుణకు ‘అమ్మ’ సవాల్!... దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఛాలెంజ్!
తమిళనాట రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటిదాకా స్తబ్ధుగా ఉన్న ఆ రాష్ట్ర రాజకీయాలు... అసెంబ్లీ సమావేశాల్లో డీఎంకే సభ్యులు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఒక్కసారిగా వాడీవేడీగా మారాయి. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 79 మంది డిఎంకే ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయించిన జయలలిత... నిన్నటి సమావేశాల్లో ఆగ్రహంతో ఊగిపోయారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ఆమె డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధికి సవాల్ విసిరారు. తాను విపక్షంలో ఉండగా... తన పార్టీ సభ్యులంతా సస్పెండైన సమయంలో తానొక్కతినే సభకు వచ్చి మాట్లాడానని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం డీఎంకే సభ్యుల్లో మెజారిటీ మంది సస్పెండ్ అయినా... కరుణ సహా కొంతమంది సస్పెన్షన్ వేటు నుంచి తప్పించుకున్నారు. సభ నుంచి సస్పెండ్ కాని కరుణానిధి కీలక అంశాలు చర్చకు వచ్చినప్పుడు అసెంబ్లీకి రాకపోతే ఎలాగంటూ జయలలిత చేసిన వ్యాఖ్యలు డీఎంకేను డైలమాలో పడేశాయి.