: కృష్ణమ్మ పుష్కరాలు నేటితో పరిసమాప్తి!... భారీగా తరలివస్తున్న భక్తజనం!
పవిత్ర కృష్ణమ్మ పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. 12 రోజుల క్రితం మొదలైన కృష్ణా పుష్కరాల్లో భాగంగా కృష్ణా నదీ తీర ప్రాంతాలన్నీ భక్తుల పుణ్య స్నానాలతో కిటకిటలాడాయి. నదీ పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న ఏపీలో అక్కడి ప్రభుత్వం పుష్కర స్నానాల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. ఇక తెలంగాణ సర్కారు కూడా ఉన్నంత మేర ఏర్పాట్లను పకడ్బందీగా చేసింది. రెండు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లకు జనం తండోపతండాలుగా తరలివెళ్లారు. నేటితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో నేడు రెండు రాష్ట్రాల్లోని అన్ని ఘాట్లకు భక్తజనం పోటెత్తింది. పుష్కరాలకు చివరి రోజు కావడంతో నేటి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాల కోసం వచ్చారు. వెరసి పుష్కర ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.