: ‘ఎంఎస్ ధోనీ’కి మహారాష్ట్రలో చిక్కులు...మరాఠీలోకి డబ్ చేస్తే ఊరుకోమంటున్న ఎమ్మెనెస్


టీమిండియా వండే కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ ఎంఎస్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ’ సినిమాకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెనెస్)కు చెందిన సినీ వ్యవహారాల విభాగం నుంచి తలనొప్పి మొదలైంది. ఈ చిత్రాన్ని మరాఠీలోకి డబ్ చేయవద్దంటూ సదరు శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ సినిమాను ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తే, మరాఠీ చిత్రాల మార్కెట్ ను ఈ చిత్రం దెబ్బతీసే అవకాశముందని పేర్కొంది. ఈ చిత్రాన్ని డబ్ చేస్తే కనుక, అది మరిన్ని హిందీ సినిమాలను మరాఠీ భాషలోకి డబ్ చేసే పరిస్థితులకు దారి తీయవచ్చని, అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన సినీ వ్యవహారాల విభాగం పేర్కొంది. కాగా, అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన ధోనీ జీవిత కథ యువతకు స్ఫూర్తిదాయకమని, అందుకే ‘ధోనీ’ చిత్రాన్ని అన్ని భాషల్లోకి డబ్ చేయాలని నిర్ణయించామని చిత్ర దర్శకుడు నీరజ్ పాండే పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News