: అమ్మవారు కలలో కనిపించి చెప్పిందని నాలుక కోసేసుకున్న టీనేజ్ విద్యార్థిని
అమ్మవారు కలలో కనబడి చెప్పిందంటూ తన నాలుకను ఒక టీనేజర్ కోసేసుకున్న దారుణ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడి రీవా పట్టణంలోని ఆర్ఎస్ కళాశాలలో ఆర్తి దుబే డిగ్రీ చదువుతోంది. అక్కడి కాళికాదేవీ ఆలయానికి వెళ్లిన ఆర్తి తనకు కలలో కాళికాదేవి కనిపించిందని, తన నాలుకను కానుకగా సమర్పించమని కోరిందని చెబుతూ బ్లేడుతో కట్ చేసుకుంది. దీంతో తీవ్రంగా రక్తం కారిపోవడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అయితే, అక్కడే ఉన్న భక్తులు, ఆలయ సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడానికి బదులుగా, అమ్మవారు ప్రత్యక్షమైందంటూ ఆమెకు పూజలు చేయడం ప్రారంభించారు. ఈ సంఘటనపై ఆర్తి సోదరుడు సచిన్ మాట్లాడుతూ, అమ్మవారు తనకు కలలో కనిపించిందని, తన నాలుకను కానుకగా ఇవ్వమని కోరిందని తన సోదరి తనకు చెప్పిందని, అయితే, ఏదో సరదాకు ఆ విధంగా చెబుతోందనుకున్నానని చెప్పారు. నిజంగా తన నాలుకను కోసేసుకుంటుందని ఊహించలేదని ఆయన వాపోయారు.