: మెగాస్టార్ తాజా చిత్రం మోషన్ పోస్టర్ వచ్చేసింది!... విడుదల చేసిన రామ్ చరణ్!
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ మోషన్ పోస్టర్ విడుదలైంది. చిరు తనయుడు, యువ హీరో రామ్ చరణ్ తేజ్ ఈ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించాడు. 40 సెకన్ల నిడివి ఉన్న ఈ మోషన్ పోస్టర్ లో చిరు ముఖం నేరుగా కనిపించలేదు. షాడోలా ఎంట్రీ ఇచ్చిన చిరు వెనుక భాగం మాత్రమే అందులో కనిపిస్తోంది. 'బాస్ ఈజ్ బ్యాక్’ అన్న ట్యాగ్ లైన్ తో విడుదలైన ఈ మోషన్ పోస్టర్ చిరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకునే అవకాశాలున్నాయి. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ పేరు కూడా కనిపిస్తోంది. ‘కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ’ పేరిట రంగప్రవేశం చేసిన చిరు కుటుంబానికి చెందిన కొత్త చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సదరు మోషన్ పోస్టర్ తేటతెల్లం చేసింది. సమర్పకురాలిగా చిరు సతీమణి కొణిదెల సురేఖ పేరు కూడా అందులో కనిపిస్తోంది.