: ఇద్దరమ్మాయిలు ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాకాలను ఎగురవేశారు: కేటీఆర్
ఒలింపిక్స్‌లో ఇద్దరమ్మాయిలు ఈరోజు భారత కీర్తి పతాకాలని ఎగురవేశారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి సింధు హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియానికి చేరుకుంది. సింధుని మరికాసేపట్లో ఘనంగా సన్మానించనున్నారు. స్టేడియంకి చేరుకున్న సింధు గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సింధు భారతదేశ పుత్రికగా తయారయిందని ప్రశంసించారు. సింధు విజయం వెనుక వారి తల్లిదండ్రుల త్యాగం ఉందని కేటీఆర్ అన్నారు. గెలిచిన వారిని ప్రశంసించడమే కాకుండా, ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించి మళ్లీ వచ్చే ఒలింపిక్స్‌కు క్రీడాకారులను తయారు చేయాలని పలువురు తమకు సూచిస్తున్నారని ఆయన అన్నారు. సింధులాంటి ఛాంపియన్లను తయారు చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. పుల్లెల గోపి చంద్, సింధు ఈ రోజు సాయంత్రం కేసీఆర్‌ని కలుస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తుందని అన్నారు.