: సింధు భుజం తట్టిన కేటీఆర్!... పుల్లెల గోపీచంద్ కు ఆత్మీయ ఆలింగనం!
రియో ఒలింపిక్స్ లో సత్తా చాటి రజత పతకాన్ని సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు, ఆమెకు ఓనమాలు నేర్పిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు హైదరాబాదీలు బ్రహ్మరథం పట్టారు. నేటి ఉదయం శంషాబాదు ఎయిర్ పోర్టు చేరుకున్న వారిద్దరికి రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై ఊరేగింపుగా గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన సత్కార వేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్... పీవీ సింధుకు ఘన స్వాగతం పలికారు. స్టార్ షట్లర్ భుజం తట్టిన మంత్రి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సింధు వెనుకే వచ్చిన గోపీచంద్ ను దగ్గరకు తీసుకున్న కేటీఆర్ ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.