: ప్రపంచ పర్యటన చేయాలన్న కోరిక నాలో ఎప్పట్నుంచో ఉంది: బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ
తన అందాలతో ప్రేక్షకులకు మత్తెక్కిచ్చే బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీకి ఎప్పటికైనా ప్రపంచం మొత్తాన్ని చుట్టేయాలన్న కోరిక ఉందట. షూటింగ్‌లలో సినీ తారలు సహజంగానే ప్రపంచంలోని అనేక ప్రదేశాలకు వెళతారు. అయితే, తమ షూటింగ్ కారణంగా వాటిని సరిగా చూడలేకపోతారు. అలాంటి పరిస్థితే ఈ భామకూ ఉందట. అందుకే, ఏ బాదరబందీ లేకుండా ప్రపంచాన్ని స్వేచ్ఛగా చుట్టేయాలన్న కోరిక ఉందట. అమెరికాలో పుట్టి పెరిగిన నర్గీస్ ఫక్రీకి ప్రపంచంలోని అందమైన ప్రదేశాలన్నిటినీ చూసేయాలన్న ఆసక్తి అధికంగానే ఉంది. దీనికి కారణాలూ లేకపోలేదు. పర్యాటక ప్రదేశాలంటే ఈ అమ్మడుకి చిన్నతనం నుంచే ఎంతో ఇష్టం. నర్గీస్ న్యూయార్క్‌లోని ఓ గ్రంథాలయానికి తరచూ వెళ్లి అక్కడ ఉన్న టూరిజం పుస్తకాలను చదివేదట. ఆ అలవాటుతోనే పర్యాటక ప్రదేశాలపై మక్కువ పెరిగింది. ఈ అంశంపైనే తాజాగా ఈ భామ మాట్లాడుతూ.. తనకు డేనియల్ డిఫోయిస్, రాబిన్‌సన్ వంటి రచయితల నవలల్ని అధికంగా చదివే అలవాటు ఉన్నట్లు తెలిపింది. ఆయా నవలల్లో పర్యాటక ప్రదేశాల గురించి చదివి వాటిపై ఆసక్తి పెంచుకున్నట్లు చెప్పింది. తనకు బాల్యం నుంచే నవలలు చదివే అలవాటు ఉండేదని పేర్కొంది. వాటి కారణంగానే మొత్తం ప్రపంచాన్ని చూసిరావాలన్న కోరిక తనలో ఎప్పట్నుంచో దాగి ఉన్నట్లు తెలిపింది. తాజాగా తాను లండన్, గ్రీస్ వంటి దేశాలను చుట్టివచ్చినట్లు చెప్పింది. ఎప్పటికైనా ప్రపంచం మొత్తం పర్యటిస్తానని పేర్కొంది.