: పనితీరు బాగోలేకే సీఈఓ పోస్టును వదులుకున్నా!... సంచలనం రేపుతున్న ‘ఫ్లిప్ కార్ట్’ కో-ఫౌండర్ ప్రకటన!
ఇద్దరు కుర్రాళ్ల చేతుల్లోె ప్రాణం పోసుకున్న ‘ఫ్లిప్ కార్ట్’... అనతి కాలంలోనే దేశంలో నెంబర్ వన్ ఈ-కామర్స్ దిగ్గజంగా ఎదిగింది. ఇందుకు కారణం ఆ ఇద్దరు యువకుల కఠోర దీక్ష. అత్యంత పారదర్శకంగా వారు నెరపిన మంత్రాంగం కూడా కారణమే. వారే సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్. సంస్థ ఏర్పాటుకు ముందు స్నేహితులుగానే ఉన్న వీరిద్దరూ ‘ఫ్లిప్ కార్ట్’ ఆరంభం తర్వాత నిర్దేశిత బాధ్యతలు పంచుకున్నారు. ఇందులో భాగంగా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పదవిని దక్కించుకున్న సచిన్ బన్సల్ గత జనవరిలో తన పదవికి రాజీనామా చేసేశారు. దీంతో ఆయన సంస్థ వైస్ చైర్మన్ పోస్టుకు మారిపోయారు. ఇక సచిన్ ఖాళీ చేసిన సీఈఓ పోస్టు బాధ్యతలను... అప్పటిదాకా సంస్థ చైర్మన్ గానే కాకుండా సంస్థ బ్రాండ్ అంబాసిడర్ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన బిన్నీ బన్సల్ తీసుకున్నాడు. నాడు ఈ కీలక నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని అటు సచిన్ కాని, ఇటు బిన్ని కాని వెల్లడించలేదు. తాజాగా ఆ కారణం వెలుగుచూసింది. దీనిని సచినే స్వయంగా వెల్లడించారు. మూడు రోజుల క్రితం బెంగళూరులో జరిగిన కంపెనీ నెలవారీ సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా సచిన్ వెల్లడించారు. సచిన్ చెప్పిన కారణం విన్న సంస్థ ఉద్యోగులు... ఇది కలా? నిజమా? అంటూ నోరెళ్లబెట్టారట. అయినా సీఈఓ పదవి నుంచి దిగిపోవడానికి సచిన్ చెప్పిన కారణమేంటంటే... పనితీరు సరిగ్గా లేకపోవడమేనట. సచిన్ తీరుతో సంస్థ ఎదగడానికి బదులు నానాటికీ దిగజారుతోందట. ఈ విషయాన్ని సంస్థకు సంబంధించి కీలక పోస్టుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు లేవనెత్తారట. సంస్థ యాజమానులుగా ఉండి సంస్థ ఉన్నతిని నిరోధిస్తే ఎలాగంటూ ఆ ఇద్దరు ఉద్యోగులు వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా కలకలం రేగిందట. అయితే సదరు ఉద్యోగుల వాదనను సానుకూల దృష్టితో పరిశీలించిన సచిన్ వెనువెంటనే స్పందించారు. తన నిర్ణయాలతో సంస్థ ఎదుగుదల మందగిస్తోందంటే... సీఈఓ పదవిని నుంచి తాను దిగిపోయేందుకు సిద్ధమని చెప్పడంతో పాటు సంస్థ ఎదుగుదలను కాంక్షిస్తూ ఉద్యోగులు చేసిన కామెంట్లను ఆయన స్వాగతించారు. ప్రకటించినట్లుగానే సీఈఓ పోస్టు నుంచి తప్పుకోగా, ఆ పోస్టులో బిన్ని కూర్చున్నారు.