: పులిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్న బాలీవుడ్ నటి జరీన్ ఖాన్
బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఓ పులిని దత్తత తీసుకుంటుందట. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. పులులు వేగంగా అంతరించిపోతున్నాయని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. పులులను రక్షించడం కోసం ‘సేవ్ టైగర్స్’ పేరుతో వాటిని రక్షించుకునే ప్రయత్నాలూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జరీన్ ఖాన్ పులిని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ... పులులంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. జీవరాశులన్నింటిలో అవి ఎంతో అందమైన జంతువులని పేర్కొంది. పులుల సంఖ్య తగ్గిపోవడం పట్ల జరీన్ ఖాన్ విచారం వ్యక్తం చేసింది. తనవంతు ప్రయత్నంగా పులులని సంరక్షించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఎంతో అందమైన పులులు అంతరించకూడదనే తాను వాటిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. పులిని దత్తత తీసుకోవడానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవాలని తన సన్నిహితులకు చెప్పినట్లు తెలిపింది. వాటిని దత్తత తీసుకోవడం అంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి చూసుకోవాల్సిన అవసరం లేదని, పులుల బాధ్యతలను మాత్రమే స్వీకరించాలని ఆమె చెప్పింది. పులులకి ఆహారం, వైద్యం అందిస్తే చాలని జరీన్ ఖాన్ పేర్కొంది. తాను పులిని దత్తత తీసుకునే అంశంపై జూ అధికారులతో జరీన్‌ఖాన్ సన్నిహితులు సంప్రదింపులు జరుపుతున్నారు. అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఈ భామ పులిని దత్తత తీసుకోనుందన్నమాట. తాను దత్తత తీసుకునే పులికి అప్పుడే ఓ పేరు కూడా ఎంపిక చేసుకుందట ఈ బాలీవుడ్ భామ.