: కమలహాసన్ నిజంగా విశ్వనటుడే!... ‘చెవాలియర్’ అవార్డు ప్రకటించిన ఫ్రాన్స్!
నటనతో దక్షిణ భారతాన్నే కాకుండా యావత్తు దేశాన్ని ఆకట్టుకున్న తమిళ నటుడు కమలహాసన్... నిజంగా విశ్వనటుడే. భారతీయ చలన చిత్రరంగంలో సుదీర్ఘ కాలంగా తనదైన నటనతో రాణిస్తున్న కమల్... తాజాగా ఫ్రాన్స్ పురస్కారం ‘చెవాలియర్ డి ఎల్ ఆర్డర్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్ (ద నైట్ ఆప్ ద ఆర్డ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్)’కు ఎంపికయ్యాడు. కళలు, సాహిత్య రంగంలో విశేష సేవలందిస్తున్న వారికి ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ ఈ అవార్డును అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో భాగంగా మూడో గ్రేడ్ కు చెందిన చెవాలియర్ (నైట్ యోధుడు) పురస్కారానికి కమల్ ఎంపికయ్యాడు. ఈ అవార్డుకు కమల్ ఎంపిక పట్ల భారతీయ సినీ పరిశ్రమ హర్షాతికేకం వ్యక్తం చేసింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులే కాకుండా రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల నుంచి కూడా కమల్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు అందిన ఈ అవార్డును తన మార్గదర్శకులు, అభిమానులకు అంకితమిస్తున్నట్లు కమల్ ప్రకటించాడు.