: స్పైస్ జెట్ విమానాన్ని కాపాడిన టీసీఏఎస్... తృటిలో తప్పిన పెను ప్రమాదం
చెన్నై నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన విమానం అనుమతికి మించిన ఎత్తులో ప్రయాణిస్తూ, ఎమిరేట్స్ విమానానికి అతి దగ్గరగా వెళ్లిన వేళ, దీన్ని గమనించిన టీసీఏఎస్ (ట్రాఫిక్ కొల్లిజన్ ఎవాయిడెన్స్ సిస్టమ్) హెచ్చరికలతో పెను ప్రమాదం తప్పింది. ఈ నెల 11న జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఎయిర్ ఫ్రాక్స్ ఇన్వెస్టిగేషన్ బోర్డు (ఏఐబీ)కి డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నుంచి ఆదేశాలు అందాయి. 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాలని పైలట్ కు ఆదేశాలు ఇవ్వగా, దాన్ని విస్మరించిన పైలట్, 35,400 అడుగుల ఎత్తులో వెళ్లాడు. అదే దారిలో 36 వేల అడుగుల ఎత్తున దుబాయ్ నుంచి బ్రిస్బేన్ వెళుతున్న విమానం వస్తోంది. టీసీఏఎస్ హెచ్చరించకుంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని డీజీసీ వర్గాలు వెల్లడించాయి. స్పైస్ జెట్ మాత్రం జరిగిన ఘటనలో తమ తప్పు లేదని, తొలుత తమకు 36 వేల అడుగుల ఎత్తువరకూ అనుమతి ఉందని, ఆ ఎత్తుకు చేరేలోగానే, కాస్త కిందకు దిగాలన్న ఆదేశాలు రావడంతో వాటిని పాటించామని పేర్కొంది.