: ఖమ్మం జిల్లాలో బోల్తా పడ్డ 'యాత్రా జీనీ' బస్సు... 10 మంది మృతి
హైదరాబాద్ నుంచి రాజమండ్రి మీదుగా కాకినాడకు బయలుదేరిన యాత్రా జీనీ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయికన్ గూడెం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడిన ఘోర దుర్ఘటనలో 10 మంది మరణించారు. మరో 20 మందికి పైగా గాయపడగా, వారందరినీ ఖమ్మంలోని ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అధిక వేగం ఇందుకు కారణమని తెలుస్తోంది. మరణించిన వారిలో అత్యధికులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది. వారిని గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలిలో ఖమ్మం ఎస్పీ షానవాజ్ ఖాసిం, కలెక్టర్ లు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తెల్లవారుఝామున 3 గంటల సమయంలో ప్రమాదం జరుగగా, ఆ వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం తీరుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.