: తమిళనాడులో సెక్రటేరియట్ ముందు డీఎంకే ధర్నా... స్టాలిన్ సహా 60 మంది ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్
ఈ ఉదయం చెన్నైలోని సచివాలయం ఎదుట ధర్నాకు దిగిన డీఎంకే శాసన సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జయలలిత ప్రభుత్వాన్ని, అసెంబ్లీలో అన్నాడీఎంకే పార్టీ వైఖరిని విమర్శిస్తూ, భారీ ఎత్తున కార్యకర్తలతో సెక్రటేరియట్ వద్దకు డీఎంకే సభ్యులు చేరుకోగా, అప్పటికే పెద్దఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో డీఎంకే నేత స్టాలిన్ కు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ధర్నాకు అనుమతి లేదని, ఎమ్మెల్యేలను అందరినీ అరెస్ట్ చేస్తున్నామని స్పష్టం చేసిన పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వెంటనే స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా స్టాలిన్ సహా 60 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ విధించేలా చూడాలని పైనుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో తమిళనాట అల్లర్లు చెలరేగవచ్చన్న ఆందోళన నెలకొనగా, పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు.