: హాస్టల్ నుంచి తీసేశారన్న మనస్తాపంతో మోదీకి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న జాతీయ స్థాయి క్రీడాకారిణి పూజ
తనను కాలేజీ హాస్టల్ నుంచి తొలగించారన్న మనస్తాపంతో, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖను రాసిన జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ క్రీడాకారిణి పూజ, ఆపై ఆత్మహత్య చేసుకున్న ఘటన పాటియాలా ప్రాంతంలో కలకలం రేపింది. 20 సంవత్సరాల పూజకు ఉచిత హాస్టల్ వసతిని తొలగించగా, హాస్టల్ ఫీజులు, ప్రయాణ ఖర్చులు చెల్లించుకోలేని స్థితిలో, పాటియాలాలోని ఖల్సా కాలేజీలో చదువుకుంటున్న పూజ, తన వంటి పేద అమ్మాయిలకు ఉచిత విద్యా సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ లేఖ రాసి మరణించింది. తాను కాలేజీకి నిత్యమూ వచ్చి ఇంటికి వెళ్లాలంటే రూ. 120 అవుతుందని, రోజుకంత మొత్తాన్ని తన తల్లిదండ్రులు భరించే స్థితిలో లేరని చెబుతూ, మోదీకి రాసిన లేఖలో క్రీడాకారులకు మరిన్ని నిధులు కేటాయించాలని కోరింది. నాలుగు పేజీల ఆమె లేఖలో, తన మరణానికి కోచ్ కూడా కారణమేనని, హాస్టల్ లో ఉండనివ్వకుండా చేసింది ఆయనేనని ఆరోపించింది. నెలకు తన ప్రయాణ ఖర్చు రూ. 3,720 భరించే స్థితిలో కూరగాయలమ్మే తన తండ్రి లేడని, ఇక మరణమే తనకు శరణ్యమని వాపోయింది. కాగా, ఆమె క్రీడా ప్రతిభ తగ్గిన కారణంగానే ఈ సంవత్సరం ఉచిత హాస్టల్ వసతి కల్పించలేదని ఖల్సా కాలేజీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. పూజ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.