: మరో విషాదం.. ప్రపంచాన్ని కంటతడి పెట్టించిన బాలుడి అన్న మృతి
ప్రభుత్వ వ్యతిరేక దళాల వాయుదాడుల్లో తీవ్రంగా గాయపడి ప్రపంచంతో కంటతడి పెట్టించిన సిరియాకు చెందిన పాలబుగ్గల పసివాడు ఒర్మాన్ సోదరుడు మృతి చెందాడు. ఆగస్టు 17న అలెప్పోలో జరిగిన వైమానిక దాడుల్లో ఓ అపార్ట్‌మెంట్ ధ్వంసమైంది. శిథిలాల కింద చిక్కుకున్న కుటుంబాన్ని ప్రభుత్వ దళాలు రక్షించిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఒర్మాన్(5)ను అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో తీసిన వీడియో ప్రపంచంతో కంటతడి పెట్టించింది. ఏం జరుగుతుందో తెలియక చిన్నారి ఒర్మాన్ నిశ్చేష్టుడై కదలిక లేకుండా అంబులెన్సులో కూర్చున్నాడు. ఈ ఫొటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. సిరియాలో ప్రజల దుస్థితికి అద్దం పట్టింది. ఇదే ఘటనలో ఒర్మాన్ తల్లిదండ్రులు సహ సోదరులకు కూడా గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒర్మాన్ సోదరుడు అలీ దక్నీష్(10) పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. విషయం తెలిసిన ప్రపంచం మరోమారు కంటతడి పెట్టింది.