: కిక్కిరిసిన విజయవాడ... పోలీసులు, అధికారుల తంటాలు!
కృష్ణా పుష్కరాలు తుది ఘట్టానికి చేరిన వేళ, నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు లక్షలాది సంఖ్యలో యాత్రికులు పోటెత్తడంతో విజయవాడ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. సీతానగరం ఘాట్ తో పాటు పద్మావతి, దుర్గా, పున్నమి ఘాట్లు ఇసుకేస్తే రాలనంతగా నిండిపోగా, వస్తున్న యాత్రికులను ఏ ఘాట్లకు తరలించాలన్న విషయమై పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. విజయవాడ బస్టాండులో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. బస్సులు లోనికి వచ్చేందుకు కూడా దారి లేనంతగా, బస్టాండు, ప్లాట్ ఫారాలు యాత్రికులతో నిండిపోయాయి. మరో రెండు రోజుల్లో పుష్కరాలు ముగియనుండటం, నేడు సెలవుదినం కావడంతోనే భక్తుల రాక అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే, తెల్లవారుఝాముకే ఘాట్లు, ఉదయం 8 గంటల ప్రాంతానికి పుష్కర నగర్ లన్నీ నిండిపోవడంతో, అసంఖ్యాకంగా తరలివస్తున్న యాత్రికులకు విడిది ఏర్పాట్లపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు విజయవాడ - గుంటూరు జాతీయ రహదారితో పాటు మంగళగిరి - గుంటూరు, గుంటూరు - అమరావతి దార్లలో వాహనాల రద్దీ అధికమై ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తోంది.