: టెస్టుల్లో భారత టాప్ ర్యాంకు మూన్నాళ్ల ముచ్చటే... వెనక్కు నెట్టేయనున్న పాకిస్థాన్!
వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుని టెస్టుల్లో టాప్ ర్యాంకును దక్కించుకున్న ఇండియా ఆనందం ఆవిరి కానుందా? అంటే, అవుననే అంటున్నారు క్రీడా పండితులు. చివరిదైన నాలుగో టెస్టులో మూడు రోజుల ఆట వర్షార్పణం కాగా, ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే, తదుపరి సిరీస్ వరకూ భారత టాప్ ర్యాంకు కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో మిగిలివున్నది రెండు రోజులే కావడం, విండీస్ లో వర్షాలు కురిసే అవకాశాలే అధికంగా ఉండటంతో, భారత ర్యాంకు డోలాయమానంలో పడింది. ఆస్ట్రేలియాతో పాటు పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు టాప్ పొజిషన్ ను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. వాస్తవానికి విండీస్ టూర్ విజయవంతంతో ఆస్ట్రేలియా అనుభవిస్తున్న టాప్ ర్యాంకును ఇండియా అందిపుచ్చుకుంది. లంక జట్టు ఆస్ట్రేలియాను 3-0 తేడాతో వైట్ వాష్ చేయడం కూడా భారత్ కు కలిసొచ్చింది. ఇక ఇదే సమయంలో ఇంగ్లండ్, పాకిస్థాన్ ల మధ్య 5 టెస్టుల సిరీస్ జరుగుతుండగా, చెరో రెండు మ్యాచ్ లను గెలుచుకున్నాయి. నిర్ణయాత్మకమైన ఈ పోరులో ఇంగ్లండ్ గెలిస్తే ఆ జట్టుకు, పాక్ గెలిచినా, డ్రా చేసుకున్నా పాక్ జట్టుకు నంబర్ వన్ పొజిషన్ దక్కనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పై రెండు రోజుల ఆట మాత్రమే మిగిలున్న ఆఖరి టెస్టు మ్యాచ్ లో విజయంపై ఆశలు లేకపోగా, భారత్ అనుభవిస్తున్న టాప్ పొజిషన్ ను పాక్ కొల్లగొట్టేస్తుందని క్రీడా పండితులు భావిస్తున్నారు.