: ప్రేమించిన సైనికుడితో వివాహం కోరుతూ పోలీసులను ఆశ్రయించిన ఫేస్ బుక్ ప్రియురాలు!
ఫేస్ బుక్ లో తనకు పరిచయమైన సైనికుడిని ప్రేమించిన కాల్ సెంటర్ ఉద్యోగిని, అతనితోనే వివాహం జరిపించాలని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన ఘటన కర్ణాటకలోని గంగావతిలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మైసూరుకు చెందిన శ్వేత, చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్ర ముట్టాళ్ గ్రామ యువకుడు వీరేష్ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా కలిసి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వివాహం చేసుకుందామని భావించిన సమయంలో వీరేష్ మాయమయ్యాడు. దీంతో అతని ఆచూకీ తెలుసుకోవాలని, తమకు వివాహం జరిపించాలని శుక్రవారం నాడు శ్వేత కుక్కనూరు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు వీరేష్ ను, అతని కుటుంబీకులను పిలిచి విచారణ చేశారు. తనకు మూడు నెలల సమయమిస్తే శ్వేతను వివాహం చేసుకుంటానని వీరేష్ చెప్పడం, దానికి శ్వేత సైతం అంగీకరించడంతో పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టారు.