: హృదయ విదారకం...వంద కుక్కలు మహిళపై దాడి చేశాయి!
హృదయ విదారకమైన ఘటన కేరళ రాజధానికి తిరువనంతపురానికి కూతవేటు దూరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కంజిరంకుళానికి చెందిన సిలువమ్మ (65) ఇంటికి సమీపంలో ఉన్న బీచ్ కు గతరాత్రి వెళ్లింది. అలా బీచ్ కు వెళ్లిన ఆమె ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె కుమారుడు సెల్వన్, ఆమెను వెతుక్కుంటూ వెళ్లాడు. బీచ్ ఒడ్డున కనిపించిన దృశ్యం చూసి భయంతో వణికిపోయాడు. వందకుపైగా కుక్కలు తల్లిపై దాడిచేస్తున్నాయి. అప్పటికే ఆమె ఒళ్లంతా గాయాలై రక్తమోడుతోంది. తల్లిని రక్షించుకునేందుకు సెల్వన్ ముందుకు దూకాడు. అంతే అతనిపైకి కూడా ఒక్కసారిగా కుక్కలు దూకాయి. దీంతో మరింత వణికిపోయిన సెల్వన్ సముద్రంలోకి ఉరికి ఈదుకుంటూ వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. తర్వాత గ్రామంలోకి చేరుకుని అక్కడి వారికి విషయం వివరించాడు. దీంతో గ్రామస్తులు కుక్కలను తరిమేందుకు రాగా, వారిపై కూడా అవి దాడికి దిగాయి. వాటిని ఎలాగోలా తరిమేసిన గ్రామస్థులు తీవ్రంగా గాయపడిన సిలువమ్మను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలోనే మృతి చెందింది. ఆమెపై దాడికి ముందు అదే ప్రదేశంలో మరో 52 ఏళ్ల మహిళపై ఈ కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయని తెలుస్తోంది. ఆమె ఆసుపత్రితో చికిత్స పొందుతోంది.