: వెండితెరకు బ్యాడ్మింటన్ కోచ్ 'పుల్లెల గోపీచంద్' కథ!


యావద్భారతదేశం రియో ఒలింపిక్స్ లో సింధు విజయం గురించి గర్వంగా చర్చించుకుంటోంది. సింధు సాధించిన అనితర సాధ్యమైన విజయం వెనుక ఉన్న శక్తి కోచ్ గోపీచంద్‌ అన్న విషయం మనకు తెలిసిందే. స్ఫూర్తిమంతమైన ఆయన జీవిత కథను సినిమా రూపంలో తెరకెక్కించేందుకు ఇప్పుడు సన్నాహాలు ఊపందుకున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకు దర్శకుడిగా జాతీయ అవార్డు గ్రహీత 'చందమామ కథలు' సినిమా ఫేమ్ ప్రవీణ్ సత్తారు వ్యవహరిస్తుండగా, అభిషేక్‌ నామా దీనిని నిర్మిస్తారు. ఎత్తుపల్లాలతో సాగిన గోపీచంద్‌ జీవిత కథ సినీ కథలకు ఏమాత్రం తీసిపోదని వారు పేర్కొంటున్నారు. బ్యాడ్మింటన్ కు ఆదరణ పెద్దగా లేని రోజుల్లో ఈ క్రీడను కెరీర్‌ గా ఎంచుకుని ఆయన సంఘర్షణకు లోనవ్వడం, సహక్రీడాకారిణితో ప్రేమవివాహం, ఇక కెరీర్‌ ముగిసిపోయిందనే రీతిలో గాయాలు కావడం, కోలుకుని మళ్లీ రాకెట్ చేతబట్టి ప్రతిష్ఠాత్మక అల్ ఇంగ్లండ్ టోర్నీ గెలుచుకుని భారత బ్యాడ్మింటన్‌ చరిత్రను తిరగరాయడం.. వంటి విషయాలన్నిటినీ ఇందులో స్పృశిస్తారు. అకాడమీని ప్రారంభించి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు తదితర ఆణిముత్యాలను దేశానికి అందించడం... ఇలా ఎన్నో ఘన విజయాలు గోపీచంద్ జీవితాన్ని పెనవేసుకుని వున్నాయి. ఇవన్నీ ఎంతో ఉత్కంఠ రేపే అంశాలని, ఇవన్నీ వెండితెరను అలరించే అంశాలేనని నిర్మాతా పేర్కొంటున్నారు. ఈ సినిమాను నవంబర్‌ నాటికి సెట్స్‌ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఈ సినిమాకి ప్రస్తుతానికి 'పుల్లెల గోపీచంద్' అనే పేరు పెడుతున్నట్టు తెలిపారు. అలాగే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌, బెంగళూరు, బర్మింగ్‌ హామ్‌ లలో జరపనున్నట్టు వారు తెలిపారు.

  • Loading...

More Telugu News