: ఆనాడు కరణం మల్లీశ్వరికి కూడా రూ.25 లక్షలు అందించాం.. క్రీడాకారులను ప్రోత్సహించాలనే నజరానాలు: చంద్రబాబు
దేశంలో చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్లు తయారయ్యారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆనాడు తాము హైదరాబాద్లో ఆఫ్రో ఏసియన్ గేమ్స్ అద్భుతంగా నిర్వహించామని, దానిని చూసిన తరువాత 2010లో భారత్కి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించే అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తే మరిన్ని విజయాలు సాధిస్తారని చంద్రబాబు చెప్పారు. ఒలింపిక్స్లో మన తెలుగింటి ఆడబిడ్డ మనకందరికీ గర్వకారణంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. స్వర్ణం వస్తుందనుకున్నాం.. సింధు బ్రహ్మాండంగా పోరాడింది.. రజతం తీసుకొచ్చింది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశం గర్వించేలా ఆడిందని అన్నారు. ఆమెకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఆనాడు ఒలింపిక్స్లో పతకం సాధించిన కరణం మల్లీశ్వరికి 25 లక్షల రూపాయలు తాను అందించినట్లు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత గోపిచంద్, సానియామిర్జా అందరూ అద్భుతంగా రాణించారని ఆయన అన్నారు. క్రీడలను ప్రోత్సహించాలనే తాము ప్రోత్సాహాలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.